సంచలన కమెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా గాడ్సే పై సినిమా తీస్తానంటూ ప్రకటించిన వర్మ అన్నీ తెలుసుకునే సినిమా తీస్తానని వెల్లడించిన వర్మ

నాథూరాం గాడ్సే.. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయిన వ్యక్తి. ఆయన ఎలాంటి వ్యక్తైనా.. మహాత్మ గాంధీని హత్యచేసి చెడ్డవాడిగా మిగిలిపోయారు. గాంధీ జీవిత చరిత్రను ఇటీవలే.. గాంధీ పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్‌బరో తెరకెక్కించాడు. మరి, గాంధీ జీవిత చరిత్రైతే తెరపై చూశాం. అంతో..ఇంతో పుస్తకాల్లో చదివాం. మరి, గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే గురించి మాత్రం మనకు తెలిసింది తక్కువే కదా. ఆయన కథను తెరపై ఆవిష్కరిస్తే..!? ఆ ప్రయత్నమే చేస్తున్నాడు సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి కథలంటే ముందే నిలబడే రామ్‌గోపాల్ వర్మ.. గాడ్సే కథను సినిమా తీస్తానని చెప్పాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించాడు.

‘‘నేను గాంధీ గురించి గానీ, హిట్లర్ గురించి గానీ సినిమా తీయాలనుకోవట్లేదు. నాథూరాం గాడ్సే జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తాను. ఇప్పటికే ఆయన జీవిత కథను రాయడం మొదలుపెట్టేశాను. అయితే.. గాంధీని చంపేటంత నిర్ణయాన్ని గాడ్సే ఎందుకు తీసుకున్నారు..? అసలు గాంధీని హత్యచేయాల్సిందిగా గాడ్సేను పురమాయించింది ఎవరు? అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి..? అనేదే నాకు అర్థం కాని ప్రశ్న. ఆయన గురించి ప్రతి చిన్న విషయమూ తెలుసుకోవడం చాలా..చాలా కష్టమైన పనే. కాబట్టి.. ఓ వ్యక్తి గురించి వక్రీకరించి సినిమా తీయలేను. ఆయన కథ కోసం కష్టపడతాను. అన్నీ తెలుసుకొని సినిమా తీస్తాను’’ అని వర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఎప్పుడూ నెగెటివ్ కథలనే ఎందుకు తీస్తారని అడిగితే.. వర్మ చెప్పిన సమాధానమేంటో తెలుసా..? ‘‘మన మనుషులంతా ఎక్కువగా నెగెటివిటీనే చూడాలని కోరుకోవట్లేదా..? ఇలాంటి కథలే జనాలు స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. సమాధానం దొరకని ఇలాంటి నెగెటివ్ ప్రశ్నలకు జవాబు దొరికేంత వరకు వారు ఇలాగే ఉంటారు’’ అని వర్మ చెప్పుకొచ్చాడు.