ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి అదిరిపోయే డాన్సు చేశాడు రామ్‌చరణ్. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
రామ్‌చరణ్ లో ఇటీవల చాలా మార్పు కనిపిస్తుంది. గతంలో ఆయన చాలా అగ్రెసివ్‌గా ఉండేవారు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తుండేవారు. మీడియాతోనూ ఆయన సీరియస్‌గానే రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. కానీ ఇటీవల కాలంలో చాలా మార్పు కనిపిస్తుంది. జనంలోకి బాగా వెళ్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. నిత్యం ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌లోనూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన బాగా సందడి చేశాడు. ఎక్కువ టైమ్ కేటాయించాడు. రేసింగ్‌పై ఉన్న ఆసక్తితో ఆయన ప్రత్యక్షంగా చూపించారు. ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఇదంతా ఒక ఎత్తైతే ఆయనలో మరో మార్పు వచ్చింది. వ్యక్తిగా చాలా ఫ్రీ అవుతున్నాడు. పబ్లిక్‌లోనూ యాక్టివ్‌గా మూవ్ అవుతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో ఆనంద్ మహీంద్రతో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులేసి అదరగొట్టారు. ఇప్పుడు బాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి స్టెప్పులేశారు. అక్షయ్ కుమార్ హిట్ మూవీ `మెయిన్ ఖిలాడీ తు అనారి` చిత్రంలోని టైటిల్ సాంగ్‌కి డాన్సులు చేశారు. గణేష్ ఆచార్యతో కలిసి చరణ్ చేసిన డాన్సు కిర్రాక్‌గా ఉండటం విశేషం.
ఈ డాన్సు వీడియోని గణేష్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా అభిమానులో పంచుకోగా, ఇప్పుడిది వైరల్ అవుతుంది. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో చరణ్‌ని చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఆయనలో ఇంతటి మార్పుని చూసి షాక్ అవుతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ డాన్సు వీడియోని అక్షయ్ కుమార్ కూడా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకోవడం విశేషం.
ప్రస్తుతం రామ్‌చరణ్.. శంకర్ దర్శకత్వంలో `ఆర్‌సీ15` చిత్రంలో నటిస్తున్నారు. ఇది హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇందులో గణేష్ ఆచార్యతో ఓ సాంగ్ చేయిస్తున్నారట. ఆ సాంగ్ రిహార్సల్స్ సమయంలో ఇలా `మెయిన్ ఖిలాడీ తు అనారి` పాటకి డాన్సులు చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
