స్టార్ హీరోల పుట్టిన రోజులకు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు అంతటా కరోనా వణికిపోతున్న పరిస్దితి. ఎటు నుంచి ఎలా కరోనా కాటు వేస్తుందో అని భయంతో వణుకుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 15న హీరో రామ్ పోతినేని పుట్టినరోజు జరుపుకోనున్న రామ్ తన ఫ్యాన్స్ కు  ఓ విజ్ఞప్తి చేశారు.

 ‘నా ప్రియమైన అభిమానులకి, మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను... ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను’ అంటూ తన అభిమానులకు రామ్ విజ్ఞప్తి చేశారు.

ఇది చూసిన చాలా మంది రాబోయేది ఎన్టీఆర్ పుట్టిన రోజు కూడా. మే20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ప్రతి ఏడాది అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ కూడా కరోనా నేపద్యంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దంటూ తన ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తారని అంతటా వినపడుతోంది. గత సంవత్సరం కూడా  తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు. తన తండ్రి హరికృష్ణ చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదని, ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కరోనా సమస్య వచ్చింది. మరి ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.