వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. తాజాగా వ్యూహం సినిమా టీజర్-2ను ఆర్జీవీ విడుదల చేశారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్ జగన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల అయింది. తాజాగా వ్యూహం సినిమా టీజర్-2ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఆర్జీవీ తన కోణంలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆర్జీవీ విడుదల చేసిన వ్యూహం టీజర్ 2 చూస్తుంటే.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పోలిన పాత్రలను విలన్స్ మాదిరిగా చూపించడం, వారంతా కుట్రలు చేస్తున్నట్టుగా చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా.. జగన్ జైలు జీవితం, ఫ్యామిలీ ఏమోషన్స్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా టీజర్ చూస్తే అర్థం అవుతుంది. 

ఆర్జీవీ.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌, చంద్రబాబులతో పాటు జగన్‌ను వ్యతిరేకించే వారిలో ఎవరినీ వదలకుండా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. చిరంజీవిని పోలిన పాత్రకు కూడా వెయిటేజ్‌ ఇచ్చినట్టుగా అర్థం అవుతుంది. ‘‘నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది’’ జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్‌లో కనిపించింది. అలాగే చివరలో.. ఎప్పుడో ఒకసారి మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ వినిపించింది. ఇందుకు చంద్రబాబు పోలిన పాత్రలోని వ్యక్తి..‘‘వాడికి అంతా సీన్ లేదు.. తానను తానే పొడుచుకుంటాడు’’ అని చెప్పడం చూడొచ్చు. ఇక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ 2 మాత్రం రాజకీయ ప్రకంపనాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. 

YouTube video player

ఇక, గతంలో వైసీపీకి మద్దతుగా కొన్ని చిత్రాలను తెరకెక్కించడంలో కీలక పాత్ర వహించిన ఆర్జీవీ.. ఇప్పుడు జగన్‌ను హీరోగా చూపించే కథనంతో వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ చిత్రాన్ని జనాలు ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు లబ్ది చేకూరుస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. 

ఇదిలాఉంటే, ఆదివారం ఆర్జీవీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యూహంలో తన అభిప్రాయం మాత్రమే ఉంటుందన్నారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు ఉంటాయని వర్మ చెప్పారు. వివేకా హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహం సినిమా ప్రభావం చూపుతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.