సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు రాజకీయాలు పెద్దగా తెలియవని చాలా సార్లు చెప్పారు. కానీ కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలపై పలుమార్లు స్పందించారు. మోదీ నిర్ణయాలపై, కేంద్రప్రభుత్వ సంచలన నిర్ణయాలపై కొన్నిసార్లు ట్వీట్ చేశారు.

తాజాగా చిదంబరం అరెస్ట్ పై కూడా వర్మ స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం నాడు అర్ధరాత్రి సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వర్మ చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన కార్యాలయానికే వెళ్లారని కామెంట్ చేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కీర్తించిన వర్మ.. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని కొనియాడారు. ట్విట్టర్ ద్వారా చిదంబరంపై తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి నిదర్శనమని.. ఆయన అరెస్ట్ లో ఓ ప్రత్యేకత ఉందని అన్నారు.

కేంద్ర హోంమంత్రి హోదాలో సీబీఐ కేంద్రకార్యాలయాన్ని ప్రారంభించింది ఆయనేనని.. ఇప్పుడు అదే కార్యాలయంలో కస్టడీలో ఉన్నారని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్రమోదీ ఇండియా మరోసారి నిరూపించిందని అన్నారు.