ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ ఓడిపోతుందని కన్ఫర్మ్ అయినప్పటి నుండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబుని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నాడు.

నిన్నటి వరుసగా ట్విట్టర్ లో మీమ్స్ పోస్ట్ చేస్తోన్న వర్మ తాజాగా ఓ సెటైరికల్ వీడియో వదిలాడు. 'ప్రెజంట్ పొజిషన్' అంటూ వర్మ షేర్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో చంద్రబాబుని పోలిన ఓ వ్యక్తి హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ, అందరికీ వడ్డిస్తుంటాడు.

ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుపై వర్మ ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా షూటింగ్ సమయంలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడంటూ ఇదే వీడియోను షేర్ చేశాడు.

ఇప్పుడు అదే వీడియోను చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ విడుదల చేశాడు. మరో ట్వీట్ లో ''నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్ విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని'' చెప్పారంటూ రాసుకొచ్చారు.