వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదల కాలేదు. ఎన్నికల అనంతరం ఈ చిత్రానికి విడుదల చేయాలనీ ప్రయత్నించినా కుదర్లేదు. 

కొన్ని రోజుల క్రితం విజయవాడలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ వర్మని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. కారణం చెప్పకుండా పోలీసులు అడ్డుకున్నారు అంటూ గతంలో వర్మ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ ఈ విషయంపై సంచంలన వ్యాఖ్యలు చేశారు. తాను మరోమారు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నానని ప్రకటించారు. 

వర్మ ట్వీట్ చేస్తూ చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడైతే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్ళగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించబోతున్నా.. బస్తీమే సవాల్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా ఆహ్వానం.. జైజగన్.. అని ట్వీట్ చేశాడు. 

ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం చెందింది. వైఎస్ జగన్ అద్భుత విజయం సాధించిన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే అనే ప్రచారం జరుగుతోంది.