వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సమాజంలో జరిగిన ప్రతి ఘటనని సినిమాగా తెరకెక్కిస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అయితే కంటెంట్‌ తక్కువ హడావుడి ఎక్కువ అన్నట్టుగా ఆయన సినిమాలుంటున్నాయి. మొత్తానికి వివాదాస్పద అంశాలను తెరపైకి ఎక్కిస్తూ తన మనుగడ సాధిస్తున్నాడు వర్మ. 

తాజాగా మరో సంచలన ఘటనని సినిమాగా తీస్తున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆ మధ్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ శివారులో చోటు చేసుకున్న దిశా ఘటనని ఆధారంగా చేసుకుని అదే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనికి `ఎన్‌కౌంటర్‌` అనేది ట్యాగ్‌లైన్‌. శనివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ టైటిల్‌ పోస్టర్‌ని వర్మ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు. రోడ్డు పక్కన స్కూటీ, ఓ వ్యక్తి పరిగెడుతున్నట్టుగా ఉండగా, పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తున్నట్టు, అలాగే అటు వైపుగా లారీ వస్తున్నట్టుగా ఈ పోస్టర్‌ ఉంది. 

దిశా ఎన్‌కౌంటర్‌ కోణంలో సినిమా తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది. దిశాని నలుగురు లారీ డ్రైవర్సు, క్లీనర్లు రాత్రి సమయంలో గ్యాంగ్‌ రేపు చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్‌ శివారులో గతేడాది నవంబర్‌ 26న ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది నవంబర్‌ 26నే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు వర్మ ప్రకటించారు. ఈ నెల 26న టీజర్‌ విడుదల చేస్తామని తెలిపారు. నట్టి కరునా సమర్సణలో, అనురాగ్‌ కంచెర్ల నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.మరి ఇందులో వర్మ కొత్తగా ఏం చూపించబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడనేది చూడాలి.