వర్మ ప్రతి మాటలో ద్వందార్థం ఉంటుంది. ఏదీ తిన్నగా మాట్లాడరు. హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఉద్దేశిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు  హెడ్ లైన్స్ అవుతూ ఉంటాయి. తరచుగా వర్మ పవన్ పై సెటైర్స్ వేయడం, ట్రోల్ చేయడం చేస్తూ ఉంటాడు.

ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ట్రైలర్ ని ఉద్దేశిస్తూ వర్మ (Ram Gopal Varma)వరుస ట్వీట్స్ వేశారు. భీమ్లా నాయక్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు తనకు నచ్చలేదన్నాడు. పవన్ అభిమానిగా భీమ్లా నాయక్ ట్రైలర్ తనని హర్ట్ చేసినట్లు వర్మ తెలిపారు. హిందీ ప్రేక్షకులకు పవన్ కంటే రానా నే తెలుసు.. కాబట్టి వాళ్ళు సినిమాకు హీరో పవన్ కాదు రానా అనుకునే ప్రమాదం ఉందన్నాడు. అలాగే ట్రైలర్ చూస్తే భీమ్లా నాయక్ లో అసలు సినిమా అంతా రానాదే, పవన్ కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ ఎద్దేవా చేశాడు. ఒకవైపు పవన్ అభిమానిని అంటూనే వర్మ వరుస ట్వీట్స్ తో పవన్ ఫ్యాన్స్ ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశాడు. 

వర్మ ఏమన్నా పవన్ పట్టించుకోడు. వర్మ వ్యాఖ్యలకు స్పందించేది పవన్ అభిమానులే. వాళ్లకు మండాలనే వర్మ ఉద్దేశపూర్వకంగా ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. కాగా భీమ్లా నాయక్ ట్రైలర్ పట్ల నెగిటివ్ కామెంట్స్ చేసిన వర్మ... ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Bheemla Nayak prerelease event) లో పవన్ చేసిన ప్రసంగం అద్భుతం అన్నాడు. ఇన్నేళ్ళలో పవన్ కళ్యాణ్ చేసిన నంబర్ వన్ ప్రసంగం ఇదే అంటూ కొనియాడారు. ఇక పవన్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్, స్టార్స్ కే స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. 

వర్మ పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి ఇలా స్పందించించడం శుభపరిణామం. అయితే ఆయన ఆంతర్యం ఏమిటనేది ఇక్కడ మేటర్. నిజానికి ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు ఆయన నుండి ఒక ఆవేశపూరిత ప్రసంగం ఆశించారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారని అంచనా వేశారు. అయితే ఆయన స్పీచ్ అందుకు భిన్నంగా సాగింది. చాలా వరకు సామరస్యపూర్వకంగా మాట్లాడారు. 

పవన్ తన పంథా మార్చడానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ పక్కన పెడితే సినిమా వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పవన్ డిసైడ్ అయినట్లున్నారు. అందుకే ఆయన ఎక్కువగా సినిమా గురించి మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదికపై పవన్ చేసిన ప్రసంగం అనేక పరిణామాలకు దారి తీసింది. పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడేలా చేసింది. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని కొందరు పెద్దలు హితవు పలికారు. అవన్నీ పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ శాంతంగా మాట్లాడి ఉండొచ్చు. దానికి తోడు వేదికపై తెలంగాణా నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ ఉన్నారు.