సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ వరుసగా వివాదాస్పద చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా కరోనా కాలంలో దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటుంటే వర్మ మాత్రం వరుసగా వెబ్‌ ఫిలింస్ తీస్తూ హల్‌ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లో క్లైమాక్స్‌, నేక్డ్‌ సినిమాలను రిలీజ్ చేసి భారీగా లాభాలు సాధించిన వర్మ తాజాగా పవర్‌ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాతో వర్మ మరో ప్రయోగం కూడా చేశాడు.

తొలిసారిగా సినిమా ట్రైలర్‌ చూడాలన్నా డబ్బులు పే చేయాలంటూ సంచలన ప్రకటన చేశాడు. తాను రూపొందించిన పవర్‌ స్టార్ ట్రైలర్‌ కేవలం ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో మాత్రమే రిలీజ్ అవుతుందని, ఆ ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలు చెల్లించాలంటూ ప్రకటించాడు. అయితే బుధవారం ఉదయం పవర్‌ స్టార్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో దర్శనమివ్వటంతో అంతా షాక్‌ అయ్యారు.

వర్మ కావాలనే పవర్‌ స్టార్‌ ట్రైలర్‌ను లీక్ చేశాడా..? లేక నిజంగానే లీక్‌ అయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రిలీజ్‌ అయిన కొద్ది సేపట్లోనే ఈ ట్రైలర్‌కు 50 వేలకు పైగా వ్యూస్‌ రావటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇలా యూట్యూబ్‌లో ట్రైలర్‌ వచ్చేస్తే వర్మ ప్లాన్‌ ఫెయిల్‌ అయినట్టే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ట్రైలర్‌తోనే భారీగా వసూళు చేయాలని భావించిన వర్మ ఈ లీక్‌ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.