వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్‌గోపాల్‌ వర్మ  టీమ్‌ నుంచి ఓ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. 

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు వర్మ. ఇందులో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. `గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపతి, కొట్టాట పెట్టిన గోపాల్‌ యాదవ్‌ గాని కథ`  ఆధారంగా తీస్తున్న వెబ్‌ సిరీస్‌` అని పేర్కొన్నాడు వర్మ. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. చెవులు తెరచుకొని వినాలని, తాము తీయబోయే సినిమా టైటిల్‌లోనే క్లారిటీ ఇచ్చామని, ఇది మహాభారతం కాదని చెప్పాడు. అయితే మహాభారతం లాంటి సంఘటనలు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయని, మహాభారతం కంటే ముందు నుంచి జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తుల మధ్య మహాభారతం లాంటి సంఘటన చోటు చేసుకుంటే వాళ్లు ఏం చేశారనేది ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఇందులో భగవద్గీత తరహా అంశాలు చూపించబోతున్నట్టు పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు.