జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు భీమవరం, గాజువాక నుంచి ఓటమి చెందారు. ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో చాలా మంది రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీని కొనసాగించగలరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. 

జనసేన పార్టీతో పోల్చుకుంటే ప్రజారాజ్యం బాహుబలి అని ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అభివర్ణించారు. తాజాగా ఓ టివి ఛానల్ లో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ పవన్ తిరిగి సినిమాల్లోకి రావాలనే వాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉండాలా లేక సినిమాల్లో నటించాలా అనే సలహాలు నేను ఇవ్వను. పవన్ కళ్యాణ్ నిజాయతీతో రాజకీయాల్లోకి వచ్చాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తగ్గట్లుగా పవన్ ఒక ఆర్గనైజేషన్ లా జనసేన పార్టీని నడిపించగలరా అనేదే నా డౌట్. కానీ పవన్ వ్యక్తిత్వ పరంగా తీసుకుంటే మాత్రం నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం పవన్ ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. అమితాబ్ బచ్చన్ సొంత నిర్ణయంతో రాజకీయాల్లోకి రాలేదు. ఆ తర్వాత ఆయనే నాతో చెప్పారు.. నేను రాజకీయాలకు కరెక్ట్ కాదని. 

అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలకు చాలా తేడా ఉంది. పవన్ సొంతంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. భారీ అంచనాలతో వచ్చి పరాజయం చెందడం నిరాశని కలిగించే అంశమే. దీనిద్వారా పవన్ కళ్యాణ్ కు తాను ఎలాంటి తప్పులు చేశానో అనుభవం వచ్చి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ భవిష్యత్తులో జనసేనని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి అని వర్మ వ్యాఖ్యానించాడు.