సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నటి శ్రీదేవి బయోపిక్ ని మాత్రం టచ్ చేయనని అంటున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవిని ఓ దేవతలా చూస్తుంటాడు వర్మ. ఆమె అంతటి అందం మరెవరికీ లేదని అంటాడు.

ఆమె మరణం వర్మని ఎంతగానో బాధించింది. ఆమె గురించి వర్మకి దాదాపు అన్ని విషయాలు తెలుసు. ఆమెను ఓ భక్తుడిలా ఆరాధించిన వర్మ.. శ్రీదేవి బయోపిక్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ అర్హత వర్మకి మాత్రమే ఉందని అంటున్నారు. ఈ విషయం వర్మ వరకు వెళ్లడంతో.. తాను శ్రీదేవి బయోపిక్ ని టచ్ చేయనని క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ''నా దృష్టిలో శ్రీదేవి గొప్ప నటి. ఆమెలా మరెవ్వరూ నటించరు.. నటించలేరు. అలాంటప్పుడు ఇంకెవరితో బయోపిక్ తీయాలి. అందుకే శ్రీదేవి బయోపిక్ తీయను గాక తీయను'' అంటూ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తున్నాడు. క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో 'వెన్నుపోటు' పాట విడుదలై ఎంతగా సంచలనాలు సృష్టించిందో తెలిసిందే!