టాలీవుడ్ హీరో  రామ్‌ చరణ్‌ సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సృష్టించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతి తక్కువ కాలంలో ట్విటర్‌లో మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా నిలిచారు. కేవలం 233 రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో రామ్‌ చరణ్‌ అని తేలింది. టాలీవుడ్‌లో ఇంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్స్‌ను ఏ స్టార్‌ సాధించలేదు. చరణ్‌ ఈ ఏడాది మార్చిలో ట్విటర్‌ ఎక్కౌంట్ ప్రారంభించారు. ఆయన్ను 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. చరణ్ మాత్రం కేవలం ఇద్దర్ని మాత్రమే అనుసరిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. ఆయన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్‌ కల్యాణ్‌.

కెరీర్ విషయానికి వస్తే... రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్‌ చేస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.స్టార్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ మరో హీరో. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. 

మరోపక్క చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో చెర్రీ గెస్ట్ గా సందడి చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ‘నా తండ్రి కోసం ‘సైరా’ను నిర్మించా. నన్ను, నాన్నను ఒకే తెరపై చూడాలనేది అమ్మ కోరిక. ఆమె కోసం ‘ఆచార్య’లో నటించబోతున్నా’ అన్నారు. మరో ప్రక్క  ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’ చిత్రాలతో చిరుకి మంచి విజయాలను అందించిన రాఘవేంద్రరావు త్వరలో చిరు తనయుడు రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. చెర్రీ 14వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.