సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా దాదాపు 200 కోట్లపైగా భారీ వ్యయంతో సైరా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. 

హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫైనల్ ప్రింట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దర్శకధీరుడు రాజమౌళికి రాంచరణ్, చిరంజీవి ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది. 

ఫైనల్ అవుట్ పుట్ విషయంలో రాజమౌళి సలహాలు తీసుకునేందుకు రాంచరణ్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నాడట. రన్ టైం ఎంతుండాలి, ఇంకా ఎడిటింగ్ ఏమైనా అవసరమా అనే విషయాల్లో రాజమౌళి నుంచి సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.