సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం సహజం. కానీ.. వారసత్వం కారణం ఒకటి లేదా రెండు సినిమా అవకాశాలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత అవకాశాలు రావాలంటే మాత్రం.. కచ్చితంగా ప్రతిభ ఉండాలి. అలా వారసుడు అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకులకు పరిచయమై.. తనదైన నటన, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న నటుడు రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ రంగ స్థలం’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్..సినీ ఇండస్ట్రీకి పరిచయమై పదేళ్లు కావస్తోంది.

 

 2007లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ చిరుత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు చరణ్.  ఈ సినిమా 178 సెంటర్లలో 50రోజులు ఆడింది.ఈ చిత్రానికి చరణ్.. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సౌత్ డెబ్యటెన్ట్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఆయన నటించిన మగధీర సినిమా.. బక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.  ఈ చిత్రానికి గాను చెర్రీ  ఉత్తమ నటుడు కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు , నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు.

 

ఆ తర్వాత నటించిన ఆరెంజ్ చిత్రం పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో నచించిన రచ్చ, వి.వి.వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమాలు పర్వాలేదనిపించాయి. తర్వాత వరుసగా జంజీర్, ఎవడు, గోవింధుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాల్లో నటించాడు. గతేడాది విడుదలైన ధ్రువ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన సమంత నటిస్తోంది.