సినిమా నిర్మించటం ఒకెత్తు. దాన్ని క్రేజీగా బిజినెస్ చేయటం, సక్రమంగా జనాల్లోకి తీసుకెళ్లటం మరొక ఎత్తు. రామ్ చరణ్ కు ఇప్పుడు ఆ విషయం అర్దమవుతోంది. ఆయన అత్యంత భారీ ఎత్తున, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగినట్లే బిజినెస్ సైతం చేసారు. అత్యంత భారీ రేట్లకు ఈ సినిమాను అన్ని ఏరియాలకు కొనుగోలు చేసారు. కొనుక్కునే దాకా బాగానే ఉన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు  ప్రమోషన్ సంగతేంటి అని నిలదీస్తున్నారట. సినిమాకు భారీ క్రేజ్ తెచ్చి ఓ రేంజిలో ఓపినింగ్స్ రాకపోతే తాము పెట్టిన డబ్బుకు న్యాయం జరగదని రామ్ చరణ్ కు చెప్తున్నారట.

బాహుబలి స్దాయిలో ప్రమోషన్ చేయాలని అంటున్నారట.  అప్పటికీ తాము టీవి ఛానెల్స్ తో మాట్లాడుతున్నామని, ప్రింట్ మీడియాకు యాడ్స్, ఇంటర్వూలతో హోరెత్తిస్తామని చెప్తున్నారట. అయినా అది సరిపోదని చెప్పటంతో తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చారట. అందుకోసం ఆర్ ఆర్ ఆర్ నుంచి శెలవు తీసుకుని మరీ ప్రమోషన్ యాక్టివిటీస్ హాజరవుతానని అన్నారట. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా టీమ్ ప్రమోషన్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తోందట.

ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ క్యాస్టింగ్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ లాంటి సౌత్‌ స్టార్లు యాక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్‌ సిని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.  

ఈ మూవీ హిందీ డిజిటర్‌ రైట్స్‌ను ఎక్సెల్‌ సంస్థ భారీగా చెల్లించి తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే కేజీఎఫ్‌ను హిందీలో రిలీజ్‌ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా సైరా హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది.