రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాతలు లాభాలకు అమ్ముకున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారు.

ఈ సినిమా ఫ్లాప్ పై రామ్ చరణ్ అభిమానుల కోసంఓ లెటర్ రాశాడు. ''ప్రియమైన అభిమానులకు మరియు ప్రేక్షకులకు నా పట్ల మరియు నా సినిమాల పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు'' అంటూ మొదలుపెట్టాడు.

'వినయ విధేయ రామ' సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అంటూ చెప్పారు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనని, సినిమాను నమ్మిన పంపిణీదారులు, బయ్యర్లకు కృతజ్ఞన్యుడనై ఉంటానని చెప్పారు.

ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. ''మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపజేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయామని'' చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులు చూపిస్తోన్న ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో అందరికీ నచ్చే సినిమాలు చేయటానికి కృషి చేస్తానని చెప్పారు.