రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

యువి క్రియేషన్స్ పార్టనర్స్ లో ఒకరు రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు. ప్రభాస్ తో కూడా చరణ్ కి స్నేహం ఉంది. యువి క్రియేషన్స్ తో కూడా మంచి బంధం ఉంది. త్వరలో రామ్ చరణ్ తో ఓ సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.

చరణ్ సినిమాలను  వీరు తరచుగా కొనడం, వారు నష్టపోతే చరణ్ ఆదుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇది ఇలా ఉండగా.. 'సాహో' సినిమాకి తమ బడ్జెట్ కి మించి ఖర్చు చేసిన యువి క్రియేషన్స్ అధినేతలు ఒకానొక సమయంలో ఆర్థికంగా ఒత్తిడి లోనయ్యారట. ఆ సమయంలో చరణ్ అండగా నిలిచాడని.. ఆర్ధిక ఇబ్బందులు ఎదురు కాకుండా 'సాహో' సినిమాకి సపోర్ట్ అందించారట.

అయితే చరణ్ ఇచ్చిన డబ్బుని సాయంగా కాకుండా వాటాగా తీసుకుంటామని వారు ప్రపోజల్ పెట్టడంతో దానికి చరణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే 'సాహో' సినిమాలో తన పెట్టుబడి ఉందనే విషయాన్ని చరణ్ సీక్రెట్ గా ఉంచమన్నారట. కానీ విషయం బయటకి పొక్కింది. సినిమాకి వచ్చే లాభాల్లో చరణ్ కి పది శాతం 
వాటా ఉంటుందనేది గాసిప్ వర్గాల మాట. అయితే దీనిపై యువి కానీ, చరణ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.