మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. చరిత్ర మరచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇది. స్వాతంత్రం కోసం పోరాడి తొలి తెలుగు వీరుడు ఆయన. 

మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో నటించడంతో సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా నటించారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సైరా చిత్రం అక్టోబర్ 2న తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో కూడా విడుదలవుతోంది. 

కర్నూలు జిల్లాకు చెందిన వీరుడు నరసింహారెడ్డి. ఆయన కుటుంబీకులు ఇప్పటికి ఉన్నారు. సైరా చిత్ర చిత్రీకరణ సమయంలో తమకు న్యాయం చేస్తానని రాంచరణ్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు తమని పట్టించుకోవడం లేదని చిరంజీవి ఆఫీస్ ముందు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 

దీనిపై రాంచరణ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తి మరణించి 100 ఏళ్ళు గడచిన తర్వాత ఆయన జీవితం చరిత్ర అవుతుంది. దానిని సినిమాగా తీయాలంటే గౌరవంగా వ్యవహరించాలి. 

మంగళ్ పాండే జీవిత చరిత్రని తెరకెక్కించే సమయంలో చరిత్రలో 65 ఏళ్ళు గడచి ఉంటే చాలన్నారు. నరసింహారెడ్డిని అతడి కుటుంబ సభ్యులకు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయడం ఇష్టం లేదు. అయన దేశం కోసం పోరాడిన వ్యక్తి. ఉయ్యాలవాడ ప్రాంతం కోసం పోరాడిన వ్యక్తి. 

నేనేదైనా చేయాలనుకుంటే ఆయన ఊరికోసం కానీ, ప్రజల కోసం కానీ చేస్తాను. నలుగురు వ్యక్తులకోసమో, కుటుంబ సభ్యుల కోసమో నేనేది చేయను అని చరణ్ తేల్చి చెప్పాడు.