రామ్‌చరణ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ ఇచ్చాడు దర్శకుడు శంకర్‌. `గేమ్‌ ఛేంజర్‌` నుంచి అప్‌ డేట్‌ ఇచ్చారు. చరణ్‌ బర్త్ డేకి ట్రీట్‌ని ప్రకటించారు.  

రామ్‌ చరణ్‌.. శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `గేమ్‌ ఛేంజర్‌`. ఇది చిత్రీకరణ దశలో ఉంది. చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్లు లేవు. అప్పట్లో `జరగండి` అనే పాటని విడుదల చేస్తామని ప్రకటించారు, కానీ ఆ తర్వాత దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఎందుకు ఆపేశారో క్లారిటీ లేదు. అప్పట్నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. కనీసం కొత్త పోస్టర్లు కూడా లేవు. దీంతో మెగా ఫ్యాన్స్ శంకర్‌పై కోపంతో ఉన్నారు. 

అప్‌డేట్ల కోసం చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. ఏదైనా చెప్పాలంటూ అడుగుతున్నారు, డిమాండ్‌ చేస్తున్నారు. అయినా పట్టించుకోలేదు. ఇక అభిమానుల నిరీక్షణ ఫలించింది. `గేమ్‌ ఛేంజర్‌` నుంచి అప్‌డేట్‌ ఇచ్చింది. గతంలో ప్రకటించినట్టుగానే `జరగండి` పాటని విడుదల చేసేందుకు టీమ్‌ సిద్ధమైంది. తాజాగా మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. 

రామ్‌చరణ్‌ బర్త్ డే సందర్బంగా మార్చి 27న ఈ పాటని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వారిలో మళ్లీ ఆశలు చిరుగించాయి. అదే సమయంలో సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో చెప్పండి అనే డిమాండ్‌ పెరిగింది. మిగిలిన చాలా సినిమాల రిలీజ్‌ డేట్లు వచ్చాయి. కానీ `గేమ్‌ ఛేంజర్‌` వార్త రావడం లేదు. అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అనే ఆందోళన చెందుతున్నారు చరణ్‌ ఫ్యాన్స్. ఈ క్రమంలో టీమ్‌ బర్త్ రోజైనా ఆ క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. 

ఇక రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌`కి శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్‌ జే సూర్య, సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రాబోతుందట. రాజకీయాల్లో ఓ గేమ్‌ ఛేంజర్‌గా ఉండబోతుందట. ఇందులో రామ్‌చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ పోషించబోతున్నారని తెలస్తుంది. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. 

Read more: `రామాయణ్‌`లో యష్ పారితోషికం.. ప్రభాస్‌కి పోటీ తప్పేలా లేదుగా?