చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం `ఆచార్య`. ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధ అనే పాత్రలో చరణ్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన పాత్ర ప్రీ లుక్‌ ఆకట్టుకుంది. తాజాగా రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఇందులోని ఆయన పూర్తి స్థాయి లుక్‌ని విడుదల చేశారు. అయితే మెగా ఫ్యాన్స్ కి `ఆచార్య` టీమ్‌ డబుల్‌ గిఫ్ట్ ఇచ్చింది. రామ్‌చరణ్‌తోపాటు, చిరంజీవి లుక్‌ని కూడా కలిపి ఇవ్వడం మరింతగా ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఇందులో చిరంజీవి, చరణ్‌ తుపాకులు పట్టుకుని కనిపిస్తున్నారు. ఓ మారుమూల పల్లెటూరులో ఎన్‌కౌంటర్‌ తరహా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది వీరి లుక్‌. ఇందులో నక్సల్స్ గా రామ్‌చరణ్‌, చిరంజీవి నటిస్తున్నారు. నక్సల్స్ ఇతివృత్తంతోనే ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. తాజాగా ఫస్ట్ లుక్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది. చరణ్‌ ఫస్ట్ లుక్‌ని చిరంజీవి పంచుకున్నారు. ఈ లుక్‌ విడుదల చేసిన సందర్భంగా రామ్‌చరణ్‌ స్పందించి ఎమోషనల్‌ అయ్యారు. 

`మీ పక్కన నటించాలనేది కల కంటే ఎక్కువే నాన్న. ఇంతకంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ మరేది అడగలేను` అని తెలిపారు చరణ్‌. కొణిదెలప్రొడక్షన్‌ కంపెనీ స్పందిస్తూ `కామ్రేడ్లకే కామ్రేడ్‌` అంటూ తమ సిద్ధకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చరణ్‌, చిరంజీవిల `ఆచార్య` లుక్‌ గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, చెర్రీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. సోనూ సూద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. దీన్ని మే 13న విడుదల చేయబోతున్నారు.