'సైరా నరసింహారెడ్డి' సినిమా రిలీజ్ అవుతోన్న నేపధ్యంలో నిర్మాత రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నిర్మాతగా 'సైరా' ఓ అధ్బుతమైన ప్రయాణమని, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పని చేయడం, 'సైరా నరసింహారెడ్డి' తీయాలనే తన తండ్రి పెద్ద కలను నిజం చేయడం.. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలని అన్నారు. సినిమా 
విడుదల దగ్గరపడుతున్న కొద్దీ మనసు మొత్తం అన్ని రకాల ఎమోషన్స్ తో నిండిపోతోందని అన్నారు.

టీమ్ మొత్తాన్ని ఓ కుటుంబంగా తయారు చేసిన ఈ సినిమా పూర్తి కావడం తనను బాధిస్తోందని అన్నారు. కానీ తామంతా కష్టపడి శ్రమించి తీసిన సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు చూడబోతుండడం ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రతీ సినిమా విడుదలకు ముందు ఉండే కంగారు, ఎగ్జైట్మెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయని అన్నారు. 

ఓ సినిమా ఈ స్థాయికి తీసుకురావడం అంత సులభం కాదని.. దానికి కారణమైన అభిమానులు, మీడియా, పంపిణీదారులు , మొత్తం చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. సినిమా మేకింగ్ లో కీలకపాత్ర పోషించి, కొన్ని ఏళ్లుగా ఈ కథ తన తండ్రికి మాత్రమే సరిపోతుందని భావించిన వారు పరుచూరి బ్రదర్స్ అని, రత్నవేలు విజువల్స్ అధ్బుతంగా అందించారని, అమిత్ త్రివేది గొప్ప సంగీతం అందించారని చెప్పారు.

'సైరా'తో దేశంలోనే ఎంతో నైపుణ్యం ఉన్న నటులతో కలిసి పనిచేసే అద్రుష్టం తమకు దక్కిందని చెప్పారు. నటీనటులు ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.