యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరూ యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరూ స్నేహితులై ఉంటె.. అనే పాయింట్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేడు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ తమ స్నేహం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. 

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. సోక్రటీస్ చెప్పిన ఓ మాటని గుర్తు చేసుకున్నాడు. స్నేహితులుగా మారడానికి సమయం పడుతుందేమో.. కానీ ఒక్కసారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యాక బలంగా కొనసాగుతూనే ఉంటుంది. రాంచరణ్, తనకు మధ్య ఉన్న స్నేహం గురించి ఇంతకంటే గొప్ప మాట చెప్పనవసరం లేదు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 

రాంచరణ్ వ్యాఖ్యానిస్తూ.. బంధం ఏర్పడడానికి సమయం పడుతుందేమో.. కానీ ఒక్కసారి బంధం మొదలైతే జీవితాంతం కొనసాగుతుంది. ఎన్టీఆర్ తో నాకున్న రిలేషన్ అలాంటిది. నా భీం తారక్ అని రాంచరణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇద్దరూ RRRYehDosti అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు.