టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ ఎవరని చూస్తే అందులో కచ్చితంగా రామ్ చరణ్-ఉపాసన ఉంటారు. తన భర్త సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను తన అకౌంట్ ద్వారా అభిమానులకు చెబుతుంటుంది. అయితే ఉపాసన కారణంగా తను కామెడీ సినిమాలు చూడాల్సివస్తుందని నటుడు రామ్ చరణ్ వెల్లడించారు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన సతీమణి గురించి, బయోపిక్ సినిమాల గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ''బయోపిక్ సినిమాలు చాలా ఆసక్తిగా చూస్తుంటాను. నిజ జీవిత పాత్రలను తెరపై చూడడం నచ్చుతుంది. కానీ అటువంటి పాత్రలకు వెండితెరపై నేను న్యాయం చేయగలనని చెప్పలేను. కానీ భావిష్యతులో నా చేతికి ఎలాంటి సినిమాలు వస్తాయనే విషయం చెప్పలేను.

ఇక ఉపాసనతో కలిసి 'దంగల్','సోనూ కే టిటూ కీ స్వీటీ' లాంటి సినిమాలు ఇష్టంగా చూస్తుంటాం. ఎందుకంటే నా భార్యకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆమె కారణంగా నేను కూడా అటువంటి సినిమాలు చూస్తున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత రాజమౌళి దర్శకత్వంలో తారక్ తో కలిసి మల్టీస్టారర్ లో నటించనున్నాడు.