టాలీవుడ్‌ గ్లామర్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కరోనా బారిన పడింది. ఆమె టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు మంగళవారం ప్రకటించారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిందీ అమ్మడు. దీంతో తన అభిమానులకు, సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. 

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, `నేను టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే నాకు నేను హోం క్వారంటైన్‌ అయిపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. రెస్ట్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని బయటకు వచ్చి షూటింగ్‌లో పాల్గొంటాను. ఇటీవల కాలంలో నన్ను కలిసి వారంతా దయజేసి టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. అందరు జాగ్రత్తగా ఉండండి` అని పేర్కొంది రకుల్‌. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగులో `చెక్‌` చిత్రంలో నటిస్తుంది. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరో హీరోయిన్‌. దీంతోపాటు క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలో, అలాగే `భారతీయుడు 2`, `అయలాన్`లో నటిస్తుంది. ఇందులో హిందీలో `ఎటాక్‌`, `మేడే`, అర్జున్‌ కపూర్‌ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు రకుల్‌కి కరోనా సోకిందని తెలియగానే పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.