సమకాలీన హీరోయిన్లతో నాకు పోటీ లేదు- రకుల్ జయజానకీనాయక పాత్ర లీనమైపోయి చేశా-రకుల్ బోయపాటి పాత్ర డిజైన్ చేస్తే తిరుగుండదు-రకుల్
వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. రకుల్ నటించిన తాజా చిత్రం జయ జానకి నాయక. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో... హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఆ వివరాలు..
హీరోయిన్లతో నాకేమీ పోటీ లేదు...
టాలీవుడ్ సినిమా ట్రెండ్ మారుతున్నదనే మాటను ఒప్పుకోను. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు వస్తున్నాయనే అంశాన్ని అంగీకరించను. ఎందుకంటే గతంలో శ్రీదేవి నటించిన క్షణక్షణం, జెనీలియా బొమ్మరిల్లు, త్రిష నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు రావడం మంచి పరిణామం. నిన్ను కోరి చిత్రంతో నివేదా, ఫిదా సినిమాతో సాయి పల్లవికి మంచి క్రేజ్ రావడం చాలా సంతోషం. టాలెంట్ ఉన్న హీరోయిన్లు వస్తే మంచి కథలు వస్తాయి. మంచి సినిమాలను దర్శకులు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. వారిని చూసి భయపడుతున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి. ఎవరి పాత్రలు వారికి వస్తాయి. నిన్ను కోరి సినిమా చూసిన తర్వాత నివేదా, నానీని కలిశాను. వారి సక్సెస్ నేను కూడా షేర్ చేసుకొన్నాను. నానీ నాకు మంచి స్నేహితుడు. నివేదా నటన నాకు నచ్చింది. ఆ సినిమా చూస్తున్న సేపు కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్ లో నేను ఏడుస్తుంటే నా సోదరుడు కర్చీఫ్ ఇచ్చాడు. ఇక ఫిదా చూడటానికి వీలు కాలేదు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని లండన్ నుంచి వచ్చాను. ఫిదా చిత్రాన్ని త్వరలోనే చూస్తాను.
బోయపాటితో చేయడం...
సరైనోడు సినిమా సందర్భంగా నేను బోయపాటి శ్రీనుతో వర్క్ చేశా. ఆయనతో వర్క్ చేయడంతోపాటు ఎంజాయ్ చేశాను. బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే జయ జానకి నాయక చిత్రానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా ఉంటుంది. కొత్తగా కనిపిస్తాను. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
బోయపాటి శ్రీను స్వయంగా ఓ యాక్టర్. చాలా వరకు సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు ఆయన నటించి చూపిస్తాడు. ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎమెషన్ సీన్లు షూట్ చేసేటప్పడు సెట్‌ను ఆ వాతావరణంలోకి మార్చేస్తాడు. బోయపాటి సినిమాలో ఏ ఒక్క పాత్రైనా బాగాలేదని ఎవరూ చెప్పరు. ప్రతీ పాత్రను బాగా డిజైన్ చేస్తారు. అనుకున్న మేరకు తెరమీద ఫర్‌ఫెక్ట్ గా చూపిస్తాడు.
బోయపాటి డిఫరెంట్‌గా రూపొందించిన చిత్రం జయ జానకి నాయక. బోయపాటి మార్కు అంశాలు కలిసి ఉన్న ఓ అందమైన ప్రేమకథా చిత్రమే ఈ సినిమా. సినిమా చూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి లవ్ స్టోరి ఉంటే బాగుండు అని ప్రేక్షకులు అనుకోనే విధంగా ఉంటుంది. గతంలో ప్రేమ కథల్లో స్వచ్ఛత ఉండేది. త్యాగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి కనిపించవు. అలాంటి భావోద్వేగ అంశాలు ఉన్న కథకు బోయపాటి యాక్షన్, ఎమోషన్స్‌ను జోడించారు.
బెల్లంకొండ శ్రీనుకు క్రేజ్ పెరుగుతుంది...
బెల్లంకొండ శ్రీను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకు ముందు ఆయన క్రేజ్ కంటే దాదాపు 80 శాతం క్రేజ్ పెరుగుతుంది. సీనియర్‌గా శ్రీనుకు నేను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నేనేమైనా యాక్టింగ్ స్కూల్ ఓపెన్ చేశానా.. నటన నేర్పించడానికి. అంతకు ముందే శ్రీను రెండు సినిమాలు చేశాడు. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. చక్కగా ఫైట్స్, యాక్షన్లలో నటించాడు. శ్రీను ఏంటో త్వరలోనే తెరపైన మీరే చూస్తారు.
తెలుగు, హిందీ అనేది కాదు.. కథకే ప్రాధాన్యత..
తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ అంటే మరీ ఇష్టం. తమిళ, హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నానని అనడం తప్పు. ఎక్కడ మంచి సినిమా కథలు వస్తే వాటిని అంగీకరిస్తున్నాను. పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి క్లారిటీ లేదు. ఇంకా ఒప్పుకోలేదు. చర్చల దశలోనే ఉంది. ప్రస్తుతం స్పైడర్, ఒక తమిళ, మరో హిందీ సినిమాలో నటిస్తున్నాను.
బ్రూస్‌లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో నటించలేకపోయాను. రిలీజ్ డేట్ దగ్గరపడిన సమయంలో అప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నాను. అప్పుడు ధోని సినిమా అవకాశం వచ్చింది. మూడు రోజులు ఎలాగైనా కేటాయించాలని ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. ఐయారీ అనే చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా చిత్రంలో నటిస్తున్నాను. ధోని సినిమా వదులుకొన్నానని బాధపడుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేతో పనిచేసే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. సినీ పరిశ్రమలోకి రావాలని ప్రయత్నిస్తూ కలిసిన మొట్టమొదటి వ్యక్తి నీరజ్ పాండే. 2011లో నా తొలి ఆడిషన్ ఆయనే చేశారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధోని వచ్చింది. కానీ కుదర్లేదు. ఇప్పుడు మళ్లీ ఐయారీ కుదిరింది.

విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర...
జయ జానకి నాయక చిత్రంలో నా పాత్ర పేరు జానకి. రెండు షేడ్స్ ఉన్న కారెక్టర్ నాది. క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. అల్లరిగా, ముద్దుగా కనిపిస్తుంది. కుటుంబం అంటే జానకికి చెప్పలేనంత ఇష్టం. అలాంటి అమ్మాయి జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంటుంది. దాంతో జానకి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. జానకి జీవితం ఎలా మారిపోయింది. ఆ సంఘటన ఏంటి? అనేదే జయ జానకి నాయక సినిమా కథ.
సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే జయ జానకి నాయక చిత్రం ఆఫర్ వచ్చింది. బోయపాటితో పనిచేసినందున ఆయన స్టయిల్ నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకొన్నాను. అప్పటికే రారండోయ్ వేడుక చూద్దాంలో చేస్తున్న భ్రమరాంబ క్యారెక్టర్‌కు భిన్నమైనదిగా అనిపించడం వల్ల జానకి పాత్ర నచ్చింది. అందుకే ఒప్పుకొన్నాను. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో పోషించిన భ్రమరాంభ పాత్రకు, జానకికి ఎలాంటి పోలికలు ఉండవు. భ్రమరాంబ పాత్ర చాలా అల్లరిగా, అమాయకంగా ఉండే అమ్మాయి. అయితే జానకి పాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఇప్పటి వరకు నేను పోషించనటువంటి క్యారెక్టర్ ఇది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. షూటింగ్ జరిగిన సమయంలో నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో నేను డిప్రెషన్‌కు గురయ్యా. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన గానీ ఓ రకమైన ఫీలింగ్‌లో ఉండేదానిని. అమ్మా, అన్నతో మాట్లాడటం ద్వారా పాత్ర నుంచి బయటకు వచ్చేదానిని. చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది. నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది.. చాలా సీన్లలో కన్నీళ్లు రావడానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉపయోగించాను. కన్నీళ్లు ఎక్కువగా కారడంతో కళ్లని ఉబ్బిపోయేవి. నా పరిస్థితి చూసి నాకే బాధగా అనిపించేది. ఓ రోజు బోయపాటితో అన్నాను.. షూటింగ్ అయ్యేపోయే వరకు కళ్లు ఉబ్బి చారలు ఏర్పడి తొందరగానే ముసలితనం కనిపిస్తుందేమోనని జోక్ చేశాను. బాధలో ఉన్నానని తెలిసి నాతో రెండు నిమిషాలు మాట్లాడు అని అమ్మకు కాల్ చేసి అడిగే వారు.
ఈ సినిమాలో నా హార్ట్ ను టచ్ చేసిన సీన్లు ఉన్నాయి. నేను చెప్పడం కంటే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. కొన్ని సీన్లు చూస్తే రకుల్ అక్కడ కనిపించదు. కేవలం జానకి పాత్రనే కనిపిస్తుంది.
