తెలుగులో సినిమాలు చేయడంపై రక్షిత్ శెట్టి రియాక్షన్.. `సప్త సాగరాలు దాటి` రెండుపార్ట్ లకు కారణం అదే!
కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. తెలుగులో సినిమాలు చేయడంపై రియాక్ట్ అయ్యారు. అంతేకాదు తమపై తెలుగు సినిమాల ప్రభావం తమపై ఏ రేంజ్‌లో ఉందో ఆయన వెల్లడించారు.

ఒకప్పుడు తెలుగు సినిమాలు చాలా రోజుల తర్వాత కన్నడలో రీమేక్ అయ్యేవి. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. `కాంతార` ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ మధ్య `బాయ్స్ హాస్టల్` చిత్రం వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు మరో క్రేజీ హీరో రక్షిత్ శెట్టి నటించిన సినిమా తెలుగులో విడుదలవుతుంది. `సప్త సాగరాలు దాటి` చిత్రంతో వస్తున్నారు. రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
ఇందులో భాగంగా తెలుగులో నటించడంపై రియాక్ట్ అయ్యారు. తెలుగులో నటించేందుకు తాను సిద్ధమే అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే చిన్న చిన్న కోమియో పాత్రలు మాత్ర చేయనని, తనకు అలా నటించడం రాదని తెలిపారు. బలమైన పాత్రలు వస్తే, హీరోగా తెలుగులో నటించేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. అయితే దర్శకుడిగా మాత్రం సినిమాలు చేయలేనని వెల్లడించారు. ఇక్కడ కల్చర్, సాహిత్యంపై తనకు అవగాహన లేదని దీంతో సినిమాలు చేయడం కష్టమన్నారు.
కన్నడలో తెలుగు సినిమాల ప్రభావంపై ఆయన స్పందిస్తూ, కర్నాటకలో తెలుగు చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తన ఎక్స్ పీరియెన్స్ ని షేర్ చేసుకున్నారు. తాను స్టడీస్ చేసే సమయంలో తెలుగు స్టేడ్‌కి చెందిన ఫ్రెండ్ తనతోపాటు ఉండేవాడని, ఆ సమయంలో అల్లు అర్జున్ నటించిన `ఆర్య` చూశానని తెలిపారు. అయితే తెలుగు సినిమాలంటే కమర్షియల్ మూవీస్ అనే ఫీలింగ్ ఉండేదని, కానీ `వేదం` సినిమా చూశాక ఇక్కడ ఇలాంటి అద్భుతమైన సినిమాలు కూడా వస్తున్నాయని అర్థమయ్యిందని, ఆ తర్వాత తన దృష్టికోణం మారిందని చెప్పాడు. కమర్షియల్ చిత్రాలే కాదు, ఇలాంటి కంటెంట్ మూవీస్ కూడా ఆడగలవనే నమ్మకం ఏర్పడిందన్నారు.
`సప్త సాగరాలు దాటి` మూవీ రెండు పార్ట్ లుగా తీయడంపై రియాక్ట్ అవుతూ, మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదన్నారు. అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారు.
మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించాను. షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక.. రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించింది. మాములుగా మొదటి భాగం, రెండో భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తుంటారు. కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారు. సినిమాలోని ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని తెలిపారు.
సినిమా స్టోరి గురించి చెబుతూ, 2010 సమయంలో జరిగే కథ ఇది. క్యాసెట్లతో ముడిపడి ఉంటుంది. అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవి. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి. సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం. ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని ఈ సినిమాకి పేర్లు పెట్టామని తెలిపారు. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది.