టాలీవుడ్ లో సక్సెస్ రేట్ తక్కువ. కొందరు దర్శకులు, హీరోలు, నిర్మాతలని గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు రమేష్ వర్మ ఇద్దరూ ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. వీరిద్దరూ ఏకమై ఎట్టకేలకు రాక్షసుడు చిత్రంతో హిట్ అందుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రమేష్ వర్మ పరిస్థితి కూడా అంతే. 

రమేష్ వర్మ దర్శకుడిగా రూపొందించిన రైడ్ చిత్రం మాత్రం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రవితేజతో చేసిన వీర, నాగశౌర్యతో చేసిన అమ్మాయితో అబ్బాయి చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. నిర్మాతగా కూడా రమేష్ వర్మ కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నాడు. కానీ తమిళ రాక్షసన్ చిత్రాన్ని పక్కాగా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమేష్ వర్మ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా నాకు రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ సక్సెస్ కోసం ఈ రాక్షసుడు చేశా. నేను సొంతంగా రాసుకున్న అనేక కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల హీరో నితిన్ కు ఓ కథ వినిపించా. ఆ కథ నితిన్ తో పాటు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా చాలా బాగా నచ్చింది. 

కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. త్వరలో నితిన్ తో తప్పకుండా సినిమా చేస్తానని రమేష్ వర్మ అన్నారు.