బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సమయం దొరికితే తన కుటుంబంతో కలిసి గడపడానికే ఇష్టపడతాడు. తనకు సంబంధించిన ప్రతి వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటాడు. ఈరోజు ఉదయం హృతిక్ తన తండ్రి రాకేశ్ రోషన్ తో కలిసి ఓ ఫోటోకి పోజిచ్చాడు.

నటుడు, దర్శకుడు రాకేశ్ రోషన్, హృతిక్ రోషన్ లు కండలు తిరిగిన దేహాలతో ఉన్న ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు హృతిక్. అంతేకాదు.. తన అభిమానులను ఓ షాకింగ్ విషయం చెప్పాడు. తన తండ్రి రాకేశ్ కి క్యాన్సర్ ఉన్నట్లు, ఇటీవల ఆ విషయం తెలిసిందని అన్నాడు.

తన సోషల్ మీడియా అకౌంట్ లో.. ''ఈరోజు ఉదయం నాన్నని ఓ ఫోటో దిగుదామని అడిగాను. సర్జరీ రోజు కూడా ఆయన జిమ్ మాత్రం మిస్ అవ్వడం లేదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తి నాన్న. ఇటీవల ఆయనకి గొంతుకి సంబంధించిన క్యాన్సర్ ఉందని తెలిసింది. కానీ ఆయన దాన్నిపై విజయం సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన లాంటి లీడర్ మా కుటుంబంలో ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాం'' అంటూ రాసుకొచ్చాడు.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో చాలా మంది తారలకు క్యాన్సర్ ఉందనే విషయం వింటూనే ఉన్నాం. ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రే ఇప్పుడు రాకేశ్ రోషన్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రాకేశ్ రోషన్ ప్రస్తుతం హృతిక్ హీరోగా క్రిష్ 4, క్రిష్ 5 సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.