జీవితంలో ఎంతో హైట్స్ చూశారు రాకేష్‌ మాస్టర్‌, అంతులేని విషాదాలు చూశారు. దీంతో జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇల్లు, దుస్తులు, శరీరం ఇలా ఏదీ శాశ్వతం కాదని, మట్టిలో కలిసిపోయేదే పర్మినెంట్‌ అని జీవిత సత్యాలను తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్సు కొరియోగ్రాఫర్‌గా అదరగొట్టారు రాకేష్‌ మాస్టర్‌. దాదాపు చాలా మంది స్టార్‌ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన తన కెరీర్‌లో 1500లకుపైగా పాటలకు డాన్సులు కంపోజ్‌ చేశారు. 1990-20లో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా రాణించారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆయన క్రేజ్‌ తగ్గుతూ వచ్చింది. ఫ్యామిలీలో విషాదాలతో కుంగిపోతూ వచ్చారు రాకేష్‌ మాస్టర్‌. కొత్త తరంతో పోటీ పడలేకపోయారు. ఈ క్రమంలో ఆయన జీవితం రాను రాను మరీ ధీనంగా, దుర్భరంగా తయారైంది. 

రాకేష్‌ మాస్టర్‌కి అవకాశం ఇచ్చింది హీరో వేణు. ఆయన హీరోగా నటించిన `చిరునవ్వుతో` చిత్రంలోని `నిన్నలా మొన్నలా లేదురా` అనే పాటకి రాకేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత వందల పాటలకు ఆయన డాన్సులు కంపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్‌ మాస్టర్, జానీ మాస్టర్‌.. రాకేష్‌ మాస్టర్‌ శిష్యులే. తన వద్ద ఉంటే విషమైనా, తీపి అయిన అయినా కలిసి పంచుకుందామని అందరికి నేర్పించానని, శేఖర్‌ మాస్టర్‌ అది ఫాలో అయ్యాడని, తన వెంటా ఉన్నాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాకేష్‌ మాస్టర్‌. ఆకలితో స్నేహం చేశానని, నాతోపాటు చాలా మంది ప్రయాణించారని, కొందరు తిరిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు. 

తాజాగా రాకేష్‌ మాస్టర్‌ గతంలో యూట్యూబ్‌ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన ఆర్థిక సమస్యల గురించి చెబుతూ, ఓ వ్యక్తి వద్ద రెండు లక్షల అప్పు తీసుకున్నానని, అందులో ముప్పై వేలు తిరిగి ఇచ్చానని, కొన్ని రోజులకు అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోతే ఆయన కొడుకు వచ్చి డబ్బులు అడిగితే తన ఇంటి పత్రాలు ఇచ్చి అప్పు తీర్చినట్టు చెప్పాడు రాకేష్‌ మాస్టర్‌. అయితే మీనాన్నకి డబ్బులు అప్పుడే ఇచ్చేశా అని చెప్పొచ్చు, అలా మోసం చేసే రకం తాను కాదని వెల్లడించారు. తనని తప్ప, ఎవరినీ నమ్మనని వెల్లడించారు. 

ఆయన జీవితంలో అంతులేని విషాదాలున్నాయి. ఆ విషయాలను చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు రాకేష్‌ మాస్టర్. నా అనుకున్న వాళ్లంతా చనిపోవడంతో జీవితంపై విరక్తి కలిగిందన్నారు. తనకు తమ్ముడంటే చాలా ఇష్టమని, తను చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో తనకే తెలుసని, తర్వాత అమ్మ చనిపోయిందని, అక్క కొడుకు, చివరికి నాన్న చనిపోవడంతో జీవితంపై విరక్తి కలిగిందన్నారు. చావంటే తనకు భయం లేదని, కానీ ఈ సంఘటనల తర్వాత ఫోన్‌ వచ్చిందంటే భయం వేసేదని ఎమోషనల్‌ అయ్యారు. 

జీవితంలో ఎంతో హైట్స్ చూశారు రాకేష్‌ మాస్టర్‌, అంతులేని విషాదాలు చూశారు. దీంతో జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇల్లు, దుస్తులు, శరీరం ఇలా ఏదీ శాశ్వతం కాదని, మట్టిలో కలిసిపోయేదే పర్మినెంట్‌ అని జీవిత సత్యాలను తెలిపారు. అంతేకాదు తాను చనిపోతే తన అంతిమ యాత్ర ఎలా ఉండాలో కూడా ముందుగానే వీడియో తీసుకున్నారట. తన భార్య తండ్రి(మామ) సమాధి పక్కన వేప చెట్టు నాటాడట, దాన్ని పెంచుతున్నానని, తాను చనిపోయాక ఆ చెట్టు కిందే తనని సమాధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం గమనార్హం. 

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్‌ మాస్టర్‌ వడదెబ్బ, మల్టీఫుల్‌ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ కారణంగా ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు.