Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: రాజుగాడు

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా విజయాలు లేక సతమతమవుతున్నాడు

raju gadu movie telugu review

నటీనటులు : రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫర్ : రాజాశేఖర్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
నిర్మాత : సుంకర రాంబ్రహ్మం
దర్శకత్వం: సంజనా రెడ్డి

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా విజయాలు లేక సతమతమవుతున్నాడు. సంక్రాంతి బరిలో విడుదలైన అతడి సినిమా 'రంగులరాట్నం' కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈసారి క్లెప్టోమేనియా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'రాజుగాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:
చిన్నప్పటినుండి తనకు తెలియకుండానే దొంగతనాలు చేస్తుంటాడు రాజు(రాజ్ తరుణ్). క్లెప్టోమేనియా అనే వ్యాధి కారణంగా దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యాధిని తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రయోజనం ఉండదు. పెరిగేకొద్దీ అతడిలో దొంగతనాలు చేసే అలవాటు కూడా పెరుగుతుంది. ఇతడి ప్రవర్తన కారణంగా తన తండ్రి(రాజేంద్రప్రసాద్) ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూనే ఉంటాడు. ఒకరోజు తన్వి(అమైరా దస్తూర్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రాజు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. కానీ తన క్లెప్టోమేనియా అనే జబ్బు ఉన్న విషయాన్ని మాత్రం ఆమె దగ్గర దాస్తాడు. అలా చేయడం వలన రాజు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు..? తన ప్రేమను చివరకు దక్కించుకున్నాడా..? అనేదే మిగిలిన సినిమా. 

కళాకారుల పనితీరు: 
రాజ్‌ తరుణ్‌ మరోసారి తన నటనతో ఇంప్రెస్‌ చేశాడు. నిజంగానే దొంగతనాలు అలవాటున్న వ్యక్తిగా చక్కటి హావభావాలు కనబరిచాడు. తన పాత్రతో కొన్ని చోట్ల ఆడియన్స్ ను నవ్వించాడు. ఇక హీరోయిన్ అమైరా దస్తూర్ ఓకే అనిపిస్తుంది. సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది రాజేంద్రప్రసాద్ నటన. కొడుకు కారణంగా తిప్పలు పడే తండ్రి పాత్రలో అతడి నటనను మెచ్చుకోవాల్సిందే. సెకండ్ హాఫ్ ఈ పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. నాగినీడు,రావు రమేష్, సితార వంటి సీనియర్ ఆర్టిస్టులు తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో మిగిలిన పాత్రలేవీ కూడా పెద్దగా నోటీస్ అవ్వవు. 

సాంకేతికవర్గం పనితీరు: 
కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని దర్శకురాలు రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం పేలవంగా తయారైంది. దీంతో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏదీ లేకుండా పోయింది. కొత్త దర్శకులు తమదైన వైవిధ్యమైన చిత్రాలతో టాలెంట్ చూపిస్తుంటే సంజనా మాత్రం కనీసపు అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతలు మాత్రం సినిమాపై బాగానే ఖర్చు పెట్టారు. గోపి సుందర్ మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగుకి వచ్చేసరికి మాత్రం అతడు సరైన మ్యూజిక్ చేయలేకపోతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ పరంగా కూడా కేర్‌ తీసుకోలేదనిపిస్తుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సివుంది. సంభాషణలు సహజంగా ఉన్నప్పటికీ ఆకట్టుకోవు. 

విశ్లేషణ: 
 టైటిల్‌ని బట్టి, ప్రోమోస్‌ చూసి ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ అనే భావన కలుగుతుంది కానీ ఇందులో వినోదం కంటే కూడా విచారమే ఎక్కువుంది. ప్రథమార్ధమంతా రెండు మూడు కామెడీ సన్నివేశాలు, రొటీన్ లవ్ ట్రాక్ తో సాగుతుంది. హీరో క్యారెక్టర్ గ్రామంకి చేరగానే అసలు కథ మొదలవుతుంది. కానీ ఆ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సెకండ్ హాఫ్ లో రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులతో బలవంతంగా నవ్వించేలా ఉన్నాయి. ఎక్కడికక్కడ సినిమా నిడివి పెంచడానికి సన్నివేశాలను యాడ్ చేస్తూ పోవడం వలన కథ ఫ్లో అనేది మిస్ అయింది. వినోదాత్మకంగా మొదలైన సినిమా కొద్దిసేపటికే బోర్ కొట్టే విధంగా మారిపోతుంది. టైంబాంబ్‌, పాత సినిమాలను ఇమిటేట్ చేసే ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష. పొందికలేని కథనం, ముందుకి కదలనంత నిదానం వెరసి ఈ చిత్రాన్ని భారంగానే మార్చాయి. ఎంటర్టైన్మెంట్ కోసం వీకెండ్ లో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. 

రేటింగ్: 2/5 
 

Follow Us:
Download App:
  • android
  • ios