బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. రజినీ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన అమితాబ్... ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బిగ్ బీ అమితాబ్ బర్త్ డే నేడు. 1942 అక్టోబర్ 11న జన్మించిన ఆయన 80వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇక చిత్ర ప్రముఖులు, రాజకీయ వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అమితాబ్ నటించిన ఐకానిక్ చిత్రాల ప్రదర్శన జరుగుతుంది.
ఇక అమితాబ్ డియరెస్ట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. తన ట్వీట్ లో అమితాబ్ లెగసీని ఆయన కొనియాడారు. తనకు స్ఫూర్తిని ఇచ్చిన లెజెండరీ నటుడిగా అమితాబ్ ని అభివర్ణించాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అమితాబ్ ని సూపర్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తారు. ఆయన కలకాలం సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని ఆకాంక్షించారు. రజినీకాంత్ తనని పొగడ్తలతో ముంచెత్తిన నేపథ్యంలో అమితాబ్ ఆసక్తికర రిప్లై ఇచ్చారు.
రజినీ సర్.. మీరు నన్ను అతిగా పొగిడేశారు. మీ ఎవర్ గ్రీన్ ఇమేజ్, గ్లోరీతో నన్ను పోల్చుకోలేను. మీరు కేవలం నా సహనటుడే కాదు చాలా ప్రియమైన మిత్రుడు కూడాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యుడను, అని అమితాబ్ తన ట్వీట్ లో పొందుపరిచారు. ప్రస్తుతం అమితాబ్, రజినీకాంత్ ల ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్-అమితాబ్ మధ్య ఎంతటి అనుభందం, సాన్నిహిత్యం ఉందో ఈ ట్వీట్స్ తెలియజేస్తున్నాయి. దశాబ్దాలుగా వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. హమ్ మూవీలో అమితాబ్, రజినీకాంత్, గోవిందా కలిసి నటించారు. ఇక హిందీలో అమితాబ్ నటించిన దాదాపు 11 హిట్ చిత్రాలు రజినీకాంత్ తమిళంలో రీమేక్ చేయడం విశేషం.
