సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతంగా ఛానెల్ పెట్టబోతున్నారా..? అంటే అవుననే సంకేతాలు కోలివుడ్ వర్గాల నుండి వస్తున్నాయి. రాజకీయాలకు సంబంధించిన తమ మనుగడని కాపాడుకోవడం కోసం నాయకులు తమకంటూ సొంత ఛానెల్ ఉండాలని అనుకుంటారు.

మరికొందరు కొన్ని ఛానెల్స్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రజినీకాంత్ కూడా సొంతంగా ఛానెల్ పెట్టాలని అనుకుంటున్నారట. గతేడాది డిసంబర్ లో తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన రజినీకాంత్.. పార్టీ స్థాపించి దానికి 'మక్కల్ మంద్రమ్' అనే పేరు కూడా పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెడతానని కూడా ప్రకటించారు.

ప్రస్తుతం రజినీకాంత్ తన పార్టీ నిర్మాణ కార్యకలాపాలను ప్రముఖ వ్యక్తికి అప్పగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రజినీకాంత్ పేరు మీద ఓ టీవీ ఛానెల్ కూడా ప్రారంభించబోతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

రజిని టీవీ పేరుతో ఓ ట్రేడ్ మార్క్ ని కూడా రిజిస్టర్ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ట్రేడ్ మార్క్ కి సంబంధించిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.