రజనీకాంత్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్రమోడీ రజనీకి అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన గొప్పతనాన్ని ప్రశంసించారు. `తరతరాలుగా ప్రాచుర్యం పొందిన వారిగా కొంతమందినే గొప్పగా చెప్పుకోవచ్చు. విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిసి రజనీకాంత్‌గారు అందులో ఒకరు. భారతీయ సినిమాకి విశేషమైన సేవలందించిన తలైవాకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు` అని తెలిపారు ప్రధాని నరేంద్రమోడి. 

అందుకు రజనీకాంత్‌ స్పందిస్తూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా రజనీ చెబుతూ, `మీ శుభాకాంక్షలు ఎంతో వినయంగా,  గౌరవంగా భావిస్తున్నా. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో నన్ను గౌరవించినందుకు గౌరవనీయులైన ప్రియమైన ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని అన్నారు రజనీ. ఈ సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన వారికి రజనీ ధన్యవాదాలు తెలిపారు. 

ఇదిలా ఉంటే రజనీకి ఈ పురస్కారం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకి ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో రజనీ ఫ్యాన్స్ ఓట్లు పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటున్నారు. అవార్డు ఒక ఓట్‌ గేమ్‌ గా, ఓట్ బ్యాంక్‌గా మారిందంటున్నారు. అంతేకాదు ఒక్క సినిమా దర్శకత్వం వహించిన రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే గొప్ప దర్శకుడు. అది దర్శకత్వం వహించిన గొప్ప వారికే అవార్డుని అందిస్తుంటారు. కానీ ఇప్పుడది మిస్‌ యూజ్‌ అవుతుందంటున్నారు. 

గతంలో ఎలాంటి దర్శకత్వం వహించని ఏఎన్నార్‌కి కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇచ్చారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే తప్పుని చేసిందనే విమర్శలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పురస్కారానికి కమల్‌ హాసన్‌ అర్హుడని, ఆయన అనేక మహానటుడు, అనేక గొప్ప చిత్రాలను దర్శకుడిగా రూపొందించారు. అదే సమయంలో గొప్ప చిత్రాలను నిర్మించారు. సింగర్‌, రైటర్‌, మ్యూజిషియన్‌ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నారు. ఆయన ఈ అవార్డుకి అర్హుడనే నినాదం ఉపందుకుంది. ఇదే కాదు తెలుగుకి అన్యాయం జరిగిందనే టాక్‌ వినిపిస్తుంది. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ అవార్డు కి అర్హుడని, ఆయన మూడువందలకుపైగా చిత్రాల్లో నటించారు. అనేక సినిమాలు దర్శకత్వం వహించారు. నిర్మించారు. స్టూడియోస్‌తో సినిమాకి సేవలందించారు. ఆయన భార్య విజయనిర్మల దాదాపు నలభైకిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కనీసం వారికి పద్మ శ్రీ కూడా ఇవ్వలేదని అంటున్నారు. మొత్తంగా రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.