హీరో అవుదామనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదని.. విలన్ గా నటించడమే అప్పటి తన లక్ష్యమని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు. సీనియర్ కథారచయిత, నిర్మాత కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సభకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతిరాజా నన్నెప్పుడూ 'తలైవరే' అనే పిలుస్తారని.. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని.. కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయని.. అప్పటి నుంచే స్నేహ బంధం మరింత దృఢమైందని చెప్పారు. డబ్బు, పేరు ప్రఖ్యాతలను ఎప్పుడైనా సంపాదించుకోవచ్ఛు కానీ పాత స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టమని భారతీరాజాని ఉద్దేశిస్తూ అన్నారు.

తనకు హీరోగా నటించాలనే ఆలోచనే లేదని.. కెరీర్ ఆరంభంలో విలన్ గానే నటించానని.. తనను హీరోగా చేసిన ప్రత్యేకత కలైజ్ఞానంకు దక్కుతుందని చెప్పారు. ఇండస్ట్రీలో కథా రచయితలకు గుర్తింపు దక్కడం లేదని అవేదన వ్యక్తం చేశారు. తను నటించిన చంద్రలేఖ, బాషా వంటి పెద్ద సినిమాలకు కథా రచయిత ఎవరనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియదని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు. 

కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉన్నట్లు తాను విన్నానని.. ఆయనకి ప్రభుత్వం తరఫున ఇల్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారని.. అయితే ఆ అవకాశం ప్రభుత్వానికి ఇవ్వదలచుకాలేదని చెప్పారు రజినీకాంత్. కలైజ్ఞానం నివసించడానికి తనే మంచి ఇంటిని ఏర్పాటు చేస్తానని రజినీకాంత్ వెల్లడించారు.