సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా అందరిని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలిపారు. ఓ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు.  2020 సంవత్సరానికిగాను తనను అ‍త్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై రజనీ సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

`ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా లోని నటుడిని గుర్తించి.. ఎంతగానో ప్రోత్సహించిన.. నా స్నేహితుడు, బస్సు డ్రైవర్‌ అయిన రాజ్‌ బహదూర్, పేదరికంలో ఉన్నా నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యానారాయణరావు గైక్వాడ్‌, నన్ను రజనీకాంత్‌గా తీర్చిదిద్దిన నా గురువు కె. బాలచందర్‌తో పాటు నాకు జీవితాన్ని ప్రసాదించిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, మీడియా, డిజిటల్‌ మీడియా, అలాగే  తమిళ ప్రజలు, అభిమానులందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నాను. 

ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వన్‌, ప్రతిపాక్ష పార్టీ నేత స్టాలిన్‌, కమల్‌ హాసన్‌లతో పాటు ఇతర రాజకీయ అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అని రజనీ తన పంచుకున్న నోట్‌లో పేర్కొన్నారు. రజనీకి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రజనీ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ఇది నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది.