చంద్రబాబును కలుద్దామని అనుకున్నా.. కానీ..: రజనీకాంత్ క్లారిటీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో చంద్రబాబుతో ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ములాఖత్ కానున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబును రజనీకాంత్ కలవలేదు. తాజాగా ఈ పరిణామాలపై రజనీకాంత్ స్పందించారు. ఫ్యామిలీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరు బయలుదేరారు.
ఈ క్రమంలోనే రజనీకాంత్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల చంద్రబాబును కలవలేకపోయానని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలుద్దామనుకున్నా. ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది జరగలేదు’’ అని రజనీకాంత్ తెలిపారు.
ఇదిలాఉంటే.. చంద్రబాబు అరెస్ట్‌పై రజనీకాంత్ ఇప్పటికే స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు ఫోన్ చేసిన రజనీకాంత్.. ఆయనను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ఆత్మీయుడని ఎప్పుడూ తప్పు చేయడని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ది, సంక్షేమమే ఆయనకు రక్ష అని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రజాసంక్సేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి అని రజనీకాంత్ చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవని అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.