సినిమా టాక్ తేడా వస్తే మొదట జరిగేది లెంగ్త్ తగ్గించటం. రివ్యూల్లో బాగోలేదని చెప్పబడ్డ సీన్స్ ని లేపేయటం. చిన్న సినిమాల విషయంలో ఇది జరగదు కానీ స్టార్స్ హీరోల సినిమాల విషయంలో మాత్రం ఇది రొటీన్ గా జరిగే వ్యవరహారమే. ఇప్పుడు అదే విషయం రజనీ తాజా చిత్రం పేట విషయంలోనూ జరుగుతోంది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో ఒకేసారి విడుదలైంది.  చాలా కాలం తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వింటేజ్ లుక్ లో  కనిపిస్తూ.. తన ఫ్యాన్స్ ను  ఆకట్టుకుంటున్నారు. అయితే అది కేవలం అభిమానులకే పరిమితమైంది.

బాబిసింహా, నవాసుద్దీన్‌ సిద్ధిక్‌, ఆడుగలం నరేన్‌, సిమ్రాన్‌, త్రిష వంటి స్టార్ నటీనటులు ఉన్నా ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపును సాధించ లేకపోతోంది. రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో 1995లో ‘భాషా’ తర్వాత ఈ సినిమానే సంక్రాంతికి విడుదలైంది. 23 ఏళ్ల తర్వాత సంక్రాంతికు వచ్చిన రజనీకాంత్‌ మరోమారు విజయాన్ని అందుకుంటుందని అంతా అంచనా వేసారు. కానీ బాక్సాపీసు వద్ద ఆ మ్యాజిక్ జరగలేదు. 

దానికి కారణం ఈ చిత్రం మొత్తం 2 గంటల 52 నిమిషాల నిడివి ఉండటమే అని నిర్దారించారు. ఫస్ట్ హాఫ్  మాదిరిగా రెండో భాగంలో స్పీడు లేదని, అదే సినిమా సక్సెస్ ని వెనక్కి లాగేస్తోందని ట్రేడ్ వర్గాల్లో అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో భాగంలో దాదాపు 20 నిమిషాల సన్నివేశాన్ని చిత్ర యూనిట్  తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే అన్ని థియేటర్లలోనూ కొత్త వెర్షన్‌ ప్రదర్శితమవుతుందని సమాచారం.