సూపర్ స్టార్ రజిని సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది కాలా టీజర్ లీక్ ఘటన ఇంకా మరిచిపోకముందే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆన్‌లైన్ లీక్ వీరులు షాక్ ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రోబో2.0 చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. దీంతో రజనీ అభిమానులు, రోబో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది.

 

రోబో2.0ను లీక్ చేయగానే క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తమకంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేయడం ద్వారా భారీగానే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిమిషం నిడివితో ఇంకా పూర్తిగా ఎడిటింగ్ కానీ ఒక నిమిషం నిడివి ఉన్న రోబో2 టీజర్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. తాము ఎంతో కష్టపడి రూపొందిస్తున్న టీజర్ ఇంటర్నెట్‌లోకి రావడంతో చిత్ర యూనిట్ కంగుతిన్నట్టు తెలుస్తున్నది. రోబో2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ సుమారు రూ.400 కోట్లతో రూపొందిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందడం ఇదే తొలిసారి.

 

ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రోబో2.0 చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.

 

రిలీజ్‌ చేయక ముందే టీజర్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం సహించలేనిది. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. చాలా దారుణమైన చర్య. రెండు నిమిషాల మీ ఉత్సాహం కోసం సినీ యూనిట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తారా? అని రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ ట్వీట్ చేశారు.

 

కాలా విషయంలోనూ ఇదే జరిగింది. కాలా టీజర్‌ లీకువీరుల చేతుల్లో పడి ఇంటర్నెట్‌లోకి చేరడంతో ఆ చిత్ర యూనిట్ వెంటనే స్పందించారు. ఆ తర్వాత టీజర్ విడుదల చేసి ఉపశమనం పొందారు.