సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ప్రేక్షకులని 2.0 చిత్రంతో పలకరించిన రజని.. కొద్దిరోజుల్లోనే ఈ ఏడాది సంక్రాంతికి పేట చిత్రంతో అలరించాడు. ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. 

రజనీకాంత్ కేంద్రంగా అనేక రాజకీయ ఊహాగానాలు నెలకొని ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడుతూ రజని వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. రజనీకాంత్ తదుపరి చిత్రం కూడా ఫిక్స్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ శివ చెప్పిన కథకు రజని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

విశ్వాసం, వేదాలం, వీరం లాంటి చిత్రాల్లో అజిత్ ని శివ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం శివ స్టార్ హీరో సూర్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రజనీకాంత్ చిత్రం పట్టాలెక్కుతుంది. రజనీకాంత్ ఎన్ని సినిమాలు చేసినా అది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లోపు మాత్రమే అని ఆ తర్వాత రజనీ పొలిటికల్ గా బిజీ కాబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.