లీక్: ‘జైలర్’స్టోరీ లైన్ ఇదే, ఆ సినిమాని గుర్తు తెస్తోంది
ఆగస్ట్ నెల 10న విడుదల కాబోతున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్’. రజనీకాంత్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘హుకుం...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాట సోమవారం విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఎంత శక్తివంతంగా ఉంటుందో చాటుతూ రజనీకాంత్ చెప్పిన సంభాషణలతో ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర టీమ్. ఇది పులి హుకుం అంటూ రజనీకాంత్ సందడి చేశారు. ఈ సినిమా పూర్తిగా రజనీ మాస్ పవర్, ఆయన స్టైల్‌ని హైలెట్ చేస్తూ సాగనుందని సినీవర్గాలు చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ లీక్ అయ్యిందంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఆ వార్తల సారాంశం ప్రకారం ఈ చిత్రం స్టోరీ లైన్ ఇలా సాగుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ జైలు వార్డెన్ గా కనిపిస్తారు. ఆయన జైలర్ గా ఉంటున్న జైలుని ఓ గ్యాంగ్ బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ జైలులో ఆ గ్యాంగ్ కు చెందిన లీడర్ ఉంటారు. మిగతా స్టాప్ ఆ సమస్యను తప్పించలేక చేతులు ఎత్తేస్తే ఒంటిచేత్తో రజనీ ఆ గ్యాంగ్ నుంచి ఆ జైలుని కాపాడుతూ..వాళ్ల నాయకుడుని వెళ్లనీయకుండా చేస్తాడు. ఇది సింగిల్ ఎజెండా తో సాగే కథనం. ఇదే దర్శకుడు ఇంతకు ముందు విజయ్ తో బీస్ట్ అనే చిత్రం చేసారు. ఆ సినిమాలో కొందరు టెర్రరిస్ట్ లు ఓ షాపింగ్ మాల్ ని కాప్చర్ చేస్తారు. వారి నుంచి హీరో అందరినీ ఎలా రక్షిస్తాడనే పాయింట్ తో సాగుతుంది. ఈ సినిమా కథ కూడా దాదాపు అలాంటిదే అనిపిస్తోంది. విభిన్నపాత్రలతో జైల్లో ఫన్, యాక్షన్ ఎపిసోడ్స్ తో వింటేజ్ రజనీని ఆవిష్కరిస్తారని చెప్తున్నారు.
వచ్చే నెల 10న విడుదల కాబోతున్న జైలర్ రిలీజ్ కు ఇంకో ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ పబ్లిసిటీ మీద దృష్టి పెడుతోంది. తెలుగులో చిరంజీవి భోళా శంకర్, హిందీలో గదర్ 2, ఓ మై గాడ్ 2 గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. తమన్నాతో చేయించిన కావాలయ్యా పాట మెల్లగా మాస్ కి నచ్చింది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు జైలర్ లో ప్రత్యేక క్యామియోలు చేయడం అంచనాలు పెంచుతోంది. సునీల్ కూడా స్పెషల్ రోల్ చేశాడు. తెలుగు మార్కెట్ బాగా తగ్గిపోయిన రజని ఆశలన్నీ జైలర్ మీదే ఉన్నాయి.