మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం. 'సై రా'కు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ వాయిస్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ ఇవ్వగా.. తమిళంలో సూపర్ స్టార్ ఇస్తే బాగుంటుందని చిత్రవర్గాలుభావిస్తున్నాయి.

రజినీకాంత్, చిరంజీవిల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చిరు అడిగితే రజిని కాదనలేరు. ఆ విధంగా చూస్తే రజినీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. అదే విధంగా మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యష్, హిందీలో హృతిక్ రోషన్ లతో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ను ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రజినీకాంత్ 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్, నయనతారలతో కలిసి చిత్రబృందం జైపూర్ కు వెళ్లింది. మరి 'సై రా' కి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తారో చూడాలి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.