తిరుచ్చి జిల్లా లాల్గుడిలో సినీనటుడు రజినీకాంత్ అభిమాని దారుణహత్య కలకలం రేపింది. వినాయకచవితి వేడుకల సందర్భంగా తాగిన మైకంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవల నేపధ్యంలో ఈ హత్యజరిగింది.

లాల్గుడి చిన్నచెట్టి వీదిలో రజినీకాంత్ అభిమాని పార్ధసారథి(20), అతడి స్నేహితుడు దినేష్ కుమార్ (22) వినాయకచవితి సందర్భంగా సోమవారం ఉదయం భారీ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. సాయంత్రం వరకు భక్తులు దేవుడ్ని దర్శించుకున్నారు. 

రాత్రి వినాయక విగ్రహం ఉన్న ప్రాంతంలో దినేష్ కుమార్ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అయితే విగ్రహం కోసం వసూలు చేసిన విరాళపు సొమ్ముతో మద్యం తాగాడని పార్ధసారథి ఆరోపించాడు.

ఆ  విషయం విన్న దినేష్ కుమార్ స్నేహితుడు కార్తికేయన్ వెంటనే దినేష్ వద్దకు వెళ్లి విరాళపు సొమ్ముతో మద్యం తాగినట్టు పార్థసారథి అందరికీ చెబుతున్నాడని తెలిపాడు. దీనితో ఆగ్రహించిన దినేశ్‌కుమార్‌ ఇంటిలో నిద్రపోతున్న పార్థసారథిపై కత్తితో దాడి జరిపి అక్కడ నుండి పారిపోయాడు.

వెంటనే పార్థసారథిని ఆసుపత్రికి తరలించారు. అయితే  మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.