ఎన్టీఆర్ ను తలైవా గుర్తుచేసుకున్న వేళ!

rajinikanth Emotional Words about Sr NTR
Highlights

సీనియర్‌ ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో ధనుశ్ నిర్మించిన చిత్రం 'కాలా'. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 7న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. క‌రికాలుడుగా ర‌జ‌నీకాంత్ న‌ట విశ్వ‌రూపాన్ని తెర‌పై వీక్షించాల‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా.. రజినీకాంత్ మీడియాతో ముచ్చటించారు. 

''1978 నా తొలి తెలుగు సినిమా 'అంతులేని కథ' విడుదలైంది. తర్వాత 'అన్నదమ్ముల సవాల్‌, ఇద్దరూ అసాధ్యులే, తొలిరేయి గడిచింది' ఇలా 15-20 సినిమాలు తెలుగులో చేశాను. తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బ్రేక్‌ వచ్చింది.  తెలుగులో సినిమాలు చేయాలా? తమిళంలో సినిమాలు చేయాలా? అనే ప్రశ్న వచ్చింది. అయితే కె.బాలచందర్‌ దర్శకత్వంలో నేను తమిళంలో తొలి సినిమా చేశాను. కాబట్టి తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను.  అయితే తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమను చూపించారో.. అంతే ప్రేమను తెలుగు ప్రేక్షకులు చూపిస్తూ వ‌చ్చారు... వస్తున్నారు. అది నా భాగ్యం. తర్వాత `పెదరాయడు`లో నటించాను. తర్వాత 'భాషా, నరసింహా, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ'లతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. సీనియర్‌ ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఈ సమయంలో ఆయన్ను 
మిస్‌ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే. కె.బాలచందర్‌గారి తర్వాత నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన్ను కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. చాలా పెద్ద మనిషి.. పెద్ద దర్శకుడు. ఓ బిడ్డలా నన్ను ప్రేమించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికొస్తే.. ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్‌ ధారావి. ఆ స్లమ్‌లోని మనుషుల జీవితం ఎలా ఉంటుంది? వారికి ఎలాంటి సమస్యలుంటాయి? అనే అంశాలతో సినిమా చేశాం. సాధారణంగా హీరో క్యారెక్టర్‌కో, మరో క్యారెక్టర్‌కో ప్రాధాన్యత ఉంటుంది. కానీ కాలా సినిమాలో ఐదారు క్యారెక్టర్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్‌ మనకు గుర్తుంటుంది. ఎమోషనల్‌ అంశాలతో పాటు స్లమ్‌లో ఉండేవాళ్ల సమస్యలేంటని ఈ సినిమాలో చక్కగా చెప్పారు'' అన్నారు. 

loader