సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అంటే మొదట గుర్తొచ్చే పేరు రజినీకాంత్.. అలాంటి స్టార్ హీరో.. నటుడు కమల్ హాసన్ తరువాతే నేను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

నటన విషయంలో ఆయన ఎంతగా లీనమవుతారో.. రాజకీయాల పరంగా కూడా అంతే క్లారిటీతో వ్యవహరిస్తున్నారు కమల్. అటువంటి వ్యక్తిపై రజినీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కమల్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ అంటూ కమల్ స్థాయి గురించి వెల్లడించారు.

''నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో కమల్ హాసన్ ఫేమస్ నటుడు. యూత్ లో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా ఆయనకి మంచి క్రేజ్ ఉండేది. నేను కూడా ఆయన సినిమాలు బాగా చూసేవాడ్ని.

ఒకరోజు నేను కమల్ తో కలిసి ఆయన బండిపై వెళ్లాను. అది కలా నిజమా అని నన్ను నేను గిల్లి చూసుకున్నాను. ఆ తరువాత నాకు కూడా స్టార్ డమ్ వచ్చింది. అలా అని ఆయన కంటే నేను ఎక్కువ అని చెప్పడం కరెక్ట్ కాదు.. ఎప్పటికీ కమల్ కమలే. ఆయన తరువాతే నేను'' అంటూ కమల్ గురించి గొప్పగా మాట్లాడారు.