ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఒక్కడు కాదు.. ముగ్గురని చెప్పాలి. ఎందుకంటే ఆయన తమిళ సూపర్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌ హాసన్‌ లకు వాయిస్‌ ని అందించిన విషయం తెలిసిందే. ఆయన ఎంతో మందికి డబ్బింగ్‌ చెప్పినా, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లది ప్రత్యేక స్థానం. వారి పాత్రలకు బాలు వాయిస్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యేది. వేల కొద్దీ పాట‌ల‌ను ఆల‌పించిన గొంతు ఇక మూగ‌బోయింద‌ని తెలిసి ఎవ‌రికీ నోట మాట రావ‌డం లేదు. 

రజనీకాంత్‌.. బాలు మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. `చాలా ఏళ్లుగా సినిమాల్లో నాకు డ‌బ్బింగ్ చెప్పారు. మీ గొంతు, మీ జ్ఞాప‌కాలు నాతో ఎప్పటికీ  స‌జీవంగా ఉంటాయి. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతాను` అంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. 

మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ కూడా మ‌ర‌ణ‌వార్త తెలిసి ఉద్వేగ‌భ‌రితుల‌య్యారు. బాలుతో క‌లిసి దిగిన ఫొటోల‌న్నింటినీ ఒక ద‌గ్గ‌ర చేర్చిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా ఎస్పీ బాలు.. `సిప్పిక్కుల్ ముత్తు`, `మైఖెల్ మదన కామరాజు`, `భామనే సత్యభామనే`, `అభయ్`, `సత్యమే శివం`, `ముంబై ఎక్స్‌ప్రెస్`, `దశావతారం`, `మన్మథ బాణం` అనే సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్‌కు డ‌బ్బింగ్ చెప్పారు. గురువారం ఎస్పీ బాలును ఆఖ‌రుసారిగా పరామ‌ర్శించిన విషయం తెలిసిందే. బహుషా బాలు బతికి ఉన్నప్పుడు పరామర్శించిన ఏకైక నటుడు కమల్‌ హాసన్‌ అనే చెప్పాలి.