ఒకప్పుడు వెండితెర 'యాంగ్రీ యంగ్ మేన్'గా చెలరేగిపోయి, పేరుతెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. అయితే గత కొంతకాలంగా ఆయన ఈ యూత్ జనరేషన్ తో పోటీ పడలేక వెనకబడ్డారు. రాన్రాను తన చేసే చిత్రాల కథలు, నిర్మాణంలో మొనాటనీ వచ్చేసి, రేసులో ఆయన వెనుకపడ్డారు. కానీ తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటూ...సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. మళ్లీ ఆమధ్య వచ్చిన 'గరుడవేగ' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలలో తనదైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన 'కల్కి' మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ క్రమంలో పలు కథలు విన్న మీదట రాజశేఖర్ తాజాగా ఓ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 'షో', 'మిస్సమ్మ', 'విరోధి' వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు నీలకంఠ చెప్పిన కథ నచ్చడంతో, చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్టు పని జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారని సమాచారం.  

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మళయాళంలో 2018లో వచ్చిన జోసెఫ్ అనే చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఇదో ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్. కన్నడంలోనూ ఈ సినిమా రీమేక్ అయ్యి విజయం సాధించటంతో, రాజశేఖర్ ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. అయితే అఫీషియల్ గా ఈ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించలేదు.  ఈ సినిమాని రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక లతో కలిసి నిర్మాత ఎమ్ ఎల్ వి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.