హీరో డా. రాజశేఖర్‌ కెరీర్‌ గత కొంత కాలంగా ఒడిదుడుకులతో సాగుతుంది. `గరుడవేగ` చిత్రంతో ఆయన హిట్‌ అందుకుని పూర్వవైభవాన్ని పొందారు. కానీ తర్వాత మళ్లీ మొదటికొచ్చింది. `కల్కి` ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, కొత్త సినిమా కమిట్‌ అవ్వడానికి చాలా టైమ్‌ పట్టడంతో మళ్లీ సీన్‌ రివర్స్ అయ్యింది. ఎట్టకేలకు ఆయన ఇటీవల రెండు సినిమాలను ప్రకటించారు. తాజాగా మరో సినిమా `మర్మాణువు`ని ప్రకటించారు. దీనికి `కేరాఫ్‌ కంచరపాలెం`,  `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రాన్ని రూపొందించిన వెంకటేష్‌ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.  విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించనున్నారు.

దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25) పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్నిప్రకటించారు. `వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం` అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు.