మహానటి సావిత్రి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.. ఒకవేళ ఆమె గురించి తెలియని వాళ్లు ఆమె నటించిన ఒక్క సీన్ చూసినా ఆమె ఎంత గొప్ప నటి అనే విషయాన్ని అర్ధం చేసుకుంటారు. అంతగా తన నటనతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసింది.

అటువంటి దిగ్గజ నటితో మరెవరినైనా పోల్చాలంటే చాలానే ఆలోచిస్తారు. సౌందర్య లాంటి అగ్రహీరోయిన్ ని అప్పట్లో సావిత్రితో పోల్చేవారు. కానీ ఇప్పుడు కనీసం అరంగేట్రం కూడా చేయని నటిని సావిత్రితో పోల్చడం విడ్డూరంగా అనిపిస్తోంది. రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక విషయంలో ఇలా జరిగింది.

రాజశేఖర్ తన కూతురిని పొగుడుకోవడం కోసం ఏకంగా సావిత్రితో పోల్చేశారు. పైగా జనాలే అలా అంటున్నారని పబ్లిక్ మీదకి తోసేశారు. శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

శివాత్మిక లుక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా రిలీజ్ అయితే కానీ ఆమె నటన గురించి ఏం చెప్పలేం.. అలాంటిది ఇప్పుడే ఆమెని సావిత్రితో పోల్చడం కాస్త అతిగా అనిపిస్తోంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సావిత్రి' రేంజ్ పక్కన పెడితే కనీసం జీవిత రేంజ్ లోనైనా శివాత్మిక నటించగలదో లేదో చూడాలి!